
మద్యం దస్త్రాలపై నా సంతకం ఒక్కటైనా చూపించగలరా?
మాజీ సీఎం జగన్ సవాల్
చంద్రబాబే మద్యం కుంభకోణం కేసులో బెయిల్పై ఉన్నారు ఆ కేసును నీరుగార్చేందుకే
మాపై కేసు పెట్టారు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి మచ్చలేని అధికారులన్న జగన్
ఈనాడు, అమరావతి: 'మద్యం కుంభకోణం అసలు ఎక్కడ జరిగింది? తప్పుడు కేసు పెట్టి రాజకీయ కక్షకు దిగారు. భయపెట్టి, ప్రలోభపెట్టి, తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి అరెస్టులు చేస్తున్నారు.. మద్యం వ్యవహారానికి సంబంధించి ఒక్క దస్త్రమైనా సీఎంఓకు వచ్చినట్లు గానీ, వాటిపై నాది ఒక్క సంతకం గానీ చూపించగలరా' అని మాజీ ముఖ్యమంత్రి జగన్ సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. 'అసలు మద్యం కుంభకోణం చేసిందే చంద్రబాబు. 2014-19 మధ్య జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఆయన బెయిల్పై ఉన్నారు. ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ కేసును రద్దు చేయించుకునేందుకు ప్రయత్నిస్తూ, తిరిగి వైకాపాపై మద్యం కేసు పెట్టారు. బెయిల్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందుకు బెయిల్ రద్దయి ఆయన అరెస్టవరా' అని వ్యాఖ్యానించారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో.. ఎంపిక చేసిన కొందరు విలేకర్లతో మాట్లాడారు. మద్యం కేసులో అరెస్టు చేస్తారని భయపడుతున్నారా అని ఒక విలేకరి అడగ్గా.. 'నేను ఇక్కడే విజయవాడలో ఉన్నా, రమ్మనండి. వాళ్లను ఆపిందెవరు' అని జగన్ సమాధానమిచ్చారు.